అమిత్ షాతో చంపయి సోరెన్ భేటీ..శుక్రవారం బీజేపీలో చేరిక..!

Champai Soren meet with Amit Shah..Joined BJP on Friday..!

న్యూఢిల్లీ: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేఎంఎం సీనియర్ నాయకుడు చంపయి సోరెన్ సొంతంగా పార్టీ స్థాపిస్తారా? లేక బీజేపీలో చేరతారా? అంటూ కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. ఈ శుక్రవారం (ఆగస్టు 30) రాంచీలో ఆయన అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు అసోం సీఎం, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.

‘‘కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఝార్ఖండ్ మాజీ సీఎం, దేశంలోని ఆదివాసీ ప్రముఖ నాయకుల్లో ఒకరైన చంపయి సోరెన్ భేటీ అయ్యారు. ఆగస్టు 30న రాంచీలో ఆయన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు’’ అని ఎక్స్ వేదికగా హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

కాగా జేఎంఎం పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలై జులై 4న తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు ఒక రోజు ముందుగానే అంటే జులై 3న ముఖ్యమంత్రి పదవికి చంపయి సోరెన్ రాజీనామా చేశారు. అయితే పార్టీ నాయకత్వం చంపయి సోరెన్‌ను అవమానించిందంటూ ఆయన వర్గం ఆరోపిస్తోంది. అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీలో చేరబోతున్నారని, ఇందుకోసం చర్చలు కూడా జరిపారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.