నేడు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాల రాక

తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బృందాలు APకి రానున్నాయి. ఈరోజు కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం తెలంగాణ లోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు.

కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పర్యటించారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర అమాత్యులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా నష్టపోయిన పంటలతో పాటు ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.