Tirupati Pakala : తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.1332 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశం ఉందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభా లబ్ధి పొందుతారని చెప్పారు. మరోవైపు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తారని పేర్కొన్నారు. ఈ డబ్లింగ్ ప్రాంతంలోనే తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట ఉన్నాయని ఆయన వివరించారు.

ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి
అదేవిధంగా తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుంది. ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ తయారీ కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరుతుంది. ఇందులో భాగంగా 17 మేజర్, 327 మైనర్ వంతెనలు వస్తున్నాయి. అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్ పాస్ బ్రిడ్జ్‌లు రానున్నాయని’ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. తద్వారా 104 కిలోమీటర్ల మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్ తగ్గుతుందన్నారు. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు అవుతుందని చెప్పారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఉంటుందని తెలిపారు.
Read Also: అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు