వైద్యురాలిపై హత్యాచారం.. నిందితునికి ‘లై డిటెక్షన్ టెస్ట్’!

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ విచారణలో రోజుకో మాట చెబుతున్నాడు. దీంతో అతనికి లై డిటెక్షన్ టెస్ట్(పాలీగ్రాఫ్) నిర్వహించేందుకు అధికారులు కోర్టు అనుమతి కోరనున్నారు. అలాగే సైకో అనాలసిస్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ టెస్టులు చేసేందుకు CFSL నిపుణులు కోల్కతాకు చేరుకున్నారు. ఈ పరీక్షల వల్ల నిందితుడి మానసిక స్థితిని, అతను చెప్పే మాటల్లో అబద్ధాలను తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉంటె ఈ ఘటన ఫై నిరసనలు జరుగుతున్న తరుణంలో మమతా బెనర్జీ ప్రభుత్వం వైద్యులను బదిలీ చేయడంపై డాక్టర్ల సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. నిరసనకు మద్దతు ఇచ్చిన ఫ్యాకల్టీ సభ్యులను అన్యాయంగా బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ పేర్కొంది. తమ పోరాటంలో ఐక్యంగా, దృఢంగా నిలుస్తామని ట్వీట్ చేసింది. డాక్టర్ల బదిలీలు ఒక కుట్ర అని, సీనియర్ వైద్య నిపుణులను ‘భయపెట్టే’ ప్రయత్నమని బీజేపీ విమర్శించింది.