పెద్దవాగుకు గండి పడడంతో వరదలో కొట్టుకుపోయిన పశువులు

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి పడింది. ఈ గండి కారణంగా అనేక పల్లెలు నీటమునిగాయి. ఇక వరదలో వందలాది పశువులు కొట్టుకుపోయాయి. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది.

సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు సమాచారం. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడంతో సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు. ప్రాజెక్టు కట్ట తెగడంతో వేల ఎకరాల్లో పంట నాశనమైంది. మరోవైపు వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాల ప్రజలు కొండలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సహాయక చర్యలకు వీలు లేకుండా పోయింది.