చెరువును కబ్జా చేసి ‘పల్లా’ యునివర్సిటీ నిర్మించారని కేసు నమోదు

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తమ మార్క్ పాలనను కొనసాగిస్తుంది. ముఖ్యంగా భూ అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టడం లేదు. సమాజంలో ఎంత పెద్ద వాడైనా సరే చట్టం ముందు సమానమే అన్నట్లు హైడ్రా కు ఫుల్ అధికారం ఇచ్చింది. దీంతో హైడ్రా అధికారులు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులు , ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారికీ నోటీసులు ఇస్తూ కూల్చివేస్తున్నారు. ఈరోజు మాదాపూర్ లో నాగార్జునకు చెందిన N convention సెంటర్ ను కూల్చేశారు. అదే విధంగా బిఆర్ఎస్ నేతలకు సైతం నోటీసులు జారీ చేస్తూ వస్తున్నారు.

తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటీవి ఇంజినీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. చెరువులు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలుపైకి ఓ వైపు హైడ్రా బుల్డోజర్లు తీసుకువెళ్తున్న క్రమంలో తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు నమోదు కావడం ఆసక్తికర పరిణామంగా మారింది. మరి పల్లా కు చెందిన అక్రమాలను కూల్చేస్తారా..? లేదా అనేది చూడాలి.