అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. తాజాగా మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.
కాగా, ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పేదలకు రేషన్ కార్డులు జారీ, సూపర్ సిక్స్ పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఇటీవల సంచలనంగా మారిన అదానీ విద్యుత్ కొనుగోళ్ల లంచం వ్యవహారం, అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైనా సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, నవంబర్ 20న క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.