ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలో త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్దాయి బడ్జెట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉంటాయి. వీటిని అందుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంది.ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు వారాలకు పైగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నాలుగైదు రోజుల పాటు బడ్జెట్ భేటీలు నిర్వహించిన వైసీపీపై టీడీపీతో పాటు కూటమి పార్టీలు మండిపడేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు విపక్ష వైసీపీ కూడా సభకు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది.

రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని ఈ నెల 24 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే బడ్జెట్ తేదీని మాత్రం ఈ నెల 6న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటోంది. ఇందులో పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటిపైనా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు కీలక బిల్లుల్ని కూడా సిద్దం చేస్తున్నారు.