వినుకొండలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని అతడి ప్రత్యర్థి కత్తితో విచక్షణా రహితంగా నరికి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోయిన పల్నాడులో పోలీసుల కఠిన చర్యలతో కొంత కాలంగా ప్రశాంతంగా ఉంది. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ను మార్చిన రెండ్రోజుల్లోనే దారుణ హత్య చోటు చేసుకుంది.

హత్యకు గురైన వ్యక్తి వైసీపీ కార్యకర్త కాగా, హత్యకు పాల్పడింది టీడీపీ సానుభూతి పరుడు అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే.. లేదు అతడు కూడా వైసీపీ అతడే అంటూ టీడీపీ అంటుంది. కాగా రాజకీయ విభేదాలతోనే హత్య జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. నడిరోడ్డుపై హత్య జరుగుతుండగా ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా కొందరు వీడియోల్లో ఘటనను రికార్డ్ చేశారు. హత్య జరిగిన సమయంలో వందలాది మంది ఘటనా స్థలంలో ఉన్నా, ఎవరు దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చుట్టూ చేరి వినోదం చూశారు. ఒళ్లు జలదరించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైసీపీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్‌ బుధవారం రాత్రి 7.30కు ఇంటికి వెళ్తుండగా జిలానీ మరో ఇద్దరితో కలిసి దాడి చేశాడు. ప్రస్తుతం జిలానీ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.