కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ మంజూరు

brs-mlc-kavitha-gets-bail-in-delhi-liquor-scam

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేడు బయటకు రానున్నారు. కాగా, ఈ కేసులో కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు.

కాగా, తొలుత ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ”కవిత మాజీ ఎంపీ.. ఆమె ఎక్కడికీ వెళ్లరు. ఈడీ కేసులో 5 నెలలుగా జైలులో ఉన్నారు. ఒక మహిళగా బెయిల్‌కు అర్హురాలు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను ఆమె అప్పగించారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. ఇదే కేసులో ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు బెయిల్‌ మంజూరైంది. ఆ నిబంధనలే కవితకు వర్తిస్తాయి” అని ధర్మాసనం ఎదుట ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

అనంతరం ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. కవిత తరచూ ఫోన్లు మార్చారని.. ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటా పూర్తిగా తొలంగించారని చెప్పారు. ఫార్మాట్‌ చేసిన ఫోన్లను ఇంట్లో పనిమనుషులకు ఇచ్చారన్నారు. ఫోన్‌లోని సందేశాలను సాధారణంగా అందరూ తొలగిస్తారని.. అలా చేస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి ఏఎస్‌జీ సమాధానమిస్తూ మెసేజ్‌లనే కాకుండా పూర్తి డేటాను ఫార్మాట్‌ చేశారని కోర్టుకు తెలిపారు. సెల్‌ఫోన్‌ డేటాను పూర్తిగా ఫార్మాట్‌ చేయడం అసాధారణమన్నారు. కవిత బెయిల్‌పై విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, కవిత భర్త అనిల్‌ సుప్రీంకోర్టుకు వచ్చారు.