సుదీర్ఘ విరామం తర్వాత కవిత తొలి ట్వీట్‌

brs-mlc-kavitha-first-tweet-after-coming-out-of-jail

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత.. బుధవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఐదు నెలల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సొంత గడ్డపై కవితకు అపూర్వ స్వాగతం లభించింది.ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఎక్స్‌ వేదికగా తొలి ట్వీట్‌ పెట్టారు. సత్యమే గెలిచిందంటూ పేర్కొన్నారు.

‘సత్యమేవ జయతే’ అని ట్వీట్‌ పెట్టారు. ఈ ట్వీట్‌కు తన నివాసానికి చేరుకున్న అనంతరం భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌తో కలిసి అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. యాదాద్రి ఆలయంఫొటో పేపర్‌ క్లిప్‌ను షేర్‌ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు … కేసీఆర్‌ నిర్మించాడు !!’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత అక్రమ కేసులో కవితను అరెస్ట్‌ చేయడంతో అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన కవిత.. 160 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఎక్స్‌లో తొలి ట్వీట్‌ చేశారు.