ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి బిఆర్ఎస్ కు షాక్ ఇవ్వబోతున్నారా..?

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన తర్వాత టికెట్ దక్కని నేతలతో పాటు పార్టీ ఫై అసంతృప్తి ఉన్న వారు ఒక్కొరిగా పార్టీ కి గుడ్ బై చెపుతున్నారు. ముఖ్యంగా కీలక నేతలంతా బై బై చెపుతూ..కాంగ్రెస్ లో చేరుతున్నారు. రీసెంట్ గా మైనంపల్లి బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పగా..ఎల్లుండి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగానే మరో షాక్ బిఆర్ఎస్ కు తగలబోతున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్ ను వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది. 2018 ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. జైపాల్ యాదవ్ కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినా కూడా జైపాల్ యాదవ్ గెలుపుకోసం పని చేశారు. కానీ, ఈ సారి కూడా టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తెస్తుండడంతోనే కసిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే అయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వినికిడి.