మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేసిన ‘కాళేశ్వరం కూలిపోయింది… కేసీఆర్, హరీష్ రావులను బండకేసి కొట్టాలి’ అనే వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఏకంగా బహిరంగ సవాల్ విసిరారు. “రేవంత్ రెడ్డి… మా సిద్దిపేటకు రా. రంగనాయక సాగర్‌లో బండ కట్టి నిన్ను ఎత్తేస్తా. నువ్వు మునుగుతావో.. తేలుతావో చూద్దాం. రంగనాయక సాగర్‌లో నీళ్లుండి నువ్వు మునిగితే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టు అనుకోవాలి. ఒకవేళ నువ్వు తేలితే కాళేశ్వరం కూలినట్టు,” అంటూ హరీష్ రావు సంచలనం సృష్టించారు. తప్పుడు మాటలు, నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, చిల్లర మాటలు మానుకోవాలని రేవంత్ రెడ్డిని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
News Telugu: AP: ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్
ఆదివారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా, మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నకోడూరు ప్రాంతంలోనే 450 మంది రైతులకు దాదాపు 59 రోజులుగా రూ. 45 కోట్లు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ‘మాది రైతు ప్రభుత్వం’ అని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు కేవలం డొల్లతనమే అని రుజువైందని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చి 50 రోజులు గడిచినా చెల్లింపులు జరగకపోవడంతో, యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధర కంటే తక్కువకే పంటను అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ. 450 కోట్లు బకాయిలను విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతు సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. రైతులకు బోనస్ పడాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అలాగే, ఎన్నికల్లో ఓటు అడగాలంటే, అంతకుముందే మహిళలకు బకాయిపడ్డ రూ. 60 వేల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై స్పందిస్తూ, వచ్చే ఏడాది నుంచి పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని ఆయన అంటున్నారని, ఇప్పటికీ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని దుయ్యబట్టారు. గత కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు చీరలు ఇచ్చిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మొత్తంగా, ముఖ్యమంత్రి అబద్ధాలు మానుకోవాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై తన చిల్లర మాటలు ఆపాలని హరీష్ రావు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/