తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను భారత ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల, రాష్ట్ర ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అయితే, శుక్రవారం జరిగిన తాజా పరిణామంలో, ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రాబోయే శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికల నేపథ్యంలో, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీని ప్రభావంతో, కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు మాత్రమే కాకుండా, మార్పులు మరియు చేర్పుల కోసం సమర్పించే అభ్యర్థనలను కూడా వెంటనే నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
అయితే గ్రామసభల సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని మీసేవా కేంద్రాల ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతేకాక, ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారు అవసరమైన మార్పులు, చేర్పులను కూడా మీసేవా ద్వారా చేయించుకోవచ్చని వివరించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి అధికారిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కానీ MLC ఎన్నికల వాళ్ళ తినికి బ్రేక్ పడింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఇది ఎప్పటి వరకు అమలులో ఉంటుందనే అంశంపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ప్రజలు ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.