ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ – ఏపీ సర్కార్

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి ఇంటర్ విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులకు 1,08,619 , 92,134 సెకండియర్ విద్యార్థులకు బుక్స్ అందించనుంది. ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలతోపాటు సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగు పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి.

పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దీనిపై దృష్టి పెట్టారు. అన్నట్టుగానే ఇంటర్మీడియట్‌ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలో పాటు అవసరమైన నోట్‌ పుస్తకాలు, బ్యాగులు అందించే యత్నం చేశారు. ఈ పుస్తకాలు, బ్యాగులు జిల్లా కేంద్రానికి.. అటు నుంచి మండలాలకు చేరాయి. వచ్చే వారంలో ఇంటర్‌ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 2020-21 విద్యా సంవత్సరంలో మాత్రమే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించారు. ఆ తర్వాత ఉచితానికి మంగళం పాడారు. ఇది విద్యార్థుల పాలిట శాపంగా మారింది.