బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా నడ్డా..?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుండడం వల్ల ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లుగా సమాచారం. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50 శాతం పూర్తయిన తర్వాతే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబర్-జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ కేబినెట్‌లో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ తొలి కేబినెట్‌లో సైతం ఆయన ఇదే శాఖను నిర్వహించారు. ఇక 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు జేపీ నడ్డాకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం విధితమే.