నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన

తెలంగాణ లో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వేర్వేరు బృందాలుగా పర్యటించనున్నారు. ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డితో పాటు తను పర్యటిస్తానని తెలిపారు. మహబూబాబాద్‌, ములుగు ప్రాంతాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్‌ నేతృత్వంలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రామారావుతో కూడిన మరో బృందం పర్యటిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటె తెలంగాణ సర్కార్ ఫై కేంద్రం సీరియస్ అయ్యింది. వరద సహాయక చర్యల్లో సాయం చేసేందుకు కేంద్రం 7 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపింది. అలాగే రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. తెలంగాణకు రెండు హెలికాప్టర్లను పంపించి.. హకీంపేటలో ఉంచింది. కానీ వాటిని వినియోగించలేదని తెలుస్తోంది. రెండు హెలికాప్టర్లను పంపినా ఏం చేస్తున్నారని.. లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ప్రశ్నించింది. వరదల గురించి ఇప్పటి వరకు ఏ సమాచారం అందలేదని కేంద్రం స్పష్టం చేసింది. రోజూవారి నివేదికను పంపేలా అధికారులను ఆదేశించాలని.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. అయితే.. వర్షాలపై ఇటీవల సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కేంద్రానికి సవివరంగా లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.