న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం తేలబోతోంది..? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తోంది వార్త..
ఉదయం 8:18 గంటలకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార పార్టీ ఆప్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అరవింద్ కేజ్రీవాల్‌ను నాలుగోసారి గెలిపిస్తారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ కు బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టిపోటీదారులు ఉన్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ తనదే విజయమని ధీమాగా ఉన్నారు. లేక ఢిల్లీ ప్రజలు మాజీ సీఎం షీలా దీక్షిత్ వారసుడివైపు మొగ్గు చూపుతారా అని భావిస్తున్నారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ను ప్రజలు గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 56.41 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.

8.30 గంటలకు గమనిస్తే బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఓ చోట కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార ఆప్ పుంజుకుంది. 9 గంటల సమయానికి చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో ముందుంజలో ఉన్నాయి. దాంతో ఢిల్లీ ఎన్నికల్లో ఆధిక్యం క్రమంగా మారుతోంది. బీజేపీ, ఆప్ నువ్వానేనా అన్నట్లుగా ఫలితాలలో ఫైట్ చేస్తున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ తో బీజేపీలో ఆశలు చిగురించాయి.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. కనీస మెజార్టీ 36 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 5న ఒకే దశలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 ఓటింగ్ నమోదైంది. బీజేపీ గెలిచే అవకాశాలున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తాము నాలుగోసారి గెలుస్తామని ఆప్ చెబుతోంది. 2013 చివరి నుంచి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది.