లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్

మూడోసారి అధికారం చేపట్టిన బిజెపి..తాజాగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం , బాధ్యతలు కొనసాగుతున్న వేళ..తాజాగా లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ను నియమించారు. ఒడిశాలోని కటక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన సీనియర్ పార్లమెంటేరియన్ భర్తిహరి మహతాబ్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సమీప బీజేడీ అభ్యర్థి సంత్రుప్ట్ మిశ్రాపై 57 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1998 నుంచి 2019 వరకు బీజేడీ తరపున వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా భర్తృహరి మహతాబ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తారని కిరణ్ రిజిజు వెల్లడించారు. 18 వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారని పేర్కొన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కె.సురేష్‌.. డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ టీఆర్‌ బాలుతోపాటు తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ.. బీజేపీకి చెందిన ఎంపీలు రాధామోహన్‌ సింగ్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌ సహాయంగా ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు.