ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌..32 మంది మృతి

Bangladesh Unrest: 32 Dead As Violence Grips Dhaka, Protesters Set Fire To State TV Headquarter

ఢాకా: బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారుల్లో ఏడుగురు హత్యకు గురవడంతో హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలలో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. గురువారం ఒక్కరోజే 25 మంది మృత్యువాత పడ్డారు. చాలామంది గాయపడ్డారు. ఈ క్రమంలో శాంతియుతంగా ఉండాలంటూ నిరసనకారులను ఉద్దేశించి బంగ్లా ప్రధాని షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సంస్థ బీటీవీ ప్రధాని వీడియో సందేశాన్ని ప్రసారం చేసింది. దీనిపై మండిపడ్డ నిరసనకారులు గురువారం ఢాకాలోని బీటీవీ హెడ్డాఫీసు ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులపైకి పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బీటీవీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి ఫ్రంట్ ఆఫీసుకు నిప్పంటించారు. ప్రధాన ద్వారం వద్ద మంటలు చెలరేగడంతో చాలామంది ఉద్యోగులు లోపలే చిక్కుకుపోయారని బీటీవీ తెలిపింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే రెస్క్యూ సిబ్బంది సాయంతో అందరినీ క్షేమంగా బయటకు తీసుకు వచ్చినట్లు ప్రకటించింది.

ఆఫీసు పార్కింగ్ ప్లేస్ లోని పలు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారని వివరించింది. ఈ ఘటనలో పలు పరికరాలకు నిప్పంటుకోవడంతో బీటీవీ ప్రసారాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. హత్యకు గురైన నిరసనకారుడికి న్యాయం జరగాలని, ప్రధాని హసీనా క్షమాపణ చెప్పాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలుపుదల చేసింది.