బంగ్లా మరో పాకిస్థాన్ అవుతుంది – ప్రధాని హసీనా కుమారుడు

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి బంగ్లాదేశ్లో హింస చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన ఘర్షణల్లో 100 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 300 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ఢాకాలోని తన ప్యాలెస్‌ను వీడిన ప్రధాని షేక్ హసీనా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు.

ఈ క్రమంలో బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజిద్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి తన తల్లి ఎంత కృషి చేసినా ఇప్పుడు బంగ్లా పాకిస్థాన్లా మారుతోందన్నారు. అంతర్జాతీయ సమాజం తన తల్లిని విమర్శించడంలో బిజీగా ఉందని తప్పుబట్టారు. గత 15 ఏళ్లలో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా బంగ్లా స్థిరత్వాన్ని చవిచూసిందని వివరించారు.

ఇక అల్లరి మూకలు చుట్టుముడుతున్న సమయంలో ప్రధానిగా చివరి నిమిషాల్లో షేక్ హసీనా ఏం చేశారనేది ఆమె సన్నిహిత వర్గాలు తెలిపారు. ప్రధాని వెంటనే బయలుదేరాలని మధ్యాహ్నం 1.30కి భద్రతా సిబ్బంది హసీనాకు చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించాలన్న ఆమె కోరికను తోసిపుచ్చారు. 1.45 PMకి ప్లానింగ్ కమిషన్ భవనానికి, అక్కడి నుంచి పాత తేజ్‌గావోన్ ఎయిర్‌పోర్టుకు సోదరితో సహా హసీనాను తరలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో భారత్‌కు పంపించారు. ఇదిలా ఉంటె బంగ్లాదేశ్ ఘర్షణలపై కేంద్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విదేశాంగమంత్రి జైశంకర్ అక్కడి పరిస్థితులను విపక్షాలకు వివరిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.