తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, సంక్రాంతి తర్వాత బీజేపీ ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ ఉద్యమం బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎప్పటికీ పోరాడుతుందని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడడం చాలా దురదృష్టకరమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు లేక కుటుంబాలను పోషించలేని దుస్థితి నిరుద్యోగులను ఆత్మహత్యల దారికి నడిపిస్తోందని, ఇది మానవత్వానికి మచ్చగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని బండి సంజయ్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్‌కు నిప్పులు చెరిగారు.