ముఖ్యమంత్రి రేవంత్‌కి బండి సంజయ్‌ బహిరంగ లేఖ

bandi sanjay open letter to chief minister revanth reddy

హైదరాబాద్‌ః కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గురుకులాల్లో సిబ్బందిపై అధిక భారం అంశంపై ఆయన లేఖ రాశారు. గురుకుల విశ్వవిద్యాలయాల్లో కొత్త టైంటేబుల్ పనివేళలు కుదించాలని ఆ లేఖలో కోరారు. అధిక పనిభారం కారణంగా సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నారు.

రాత్రివేళ స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను టీచర్లకు అప్పగించవద్దని సూచించారు. వార్డెన్ పోస్టులు మంజూరైనప్పటికీ భర్తి చేయలేదన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. తక్షణమే ఈ పోస్టులను భర్తి చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు.

వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం… కరీంనగర్ జిల్లా పోలీసులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని ఆ లేఖలో కోరారు.