Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కరీంనగర్‌లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆలయ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా చర్యలు
ఇప్పటికే 2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న కరీంనగర్‌లోని 10 ఎకరాల భూమిలో భూమి పూజ కూడా జరిగిందని గుర్తు చేశారు. అయితే ఆ రోజు నుంచి నేటివరకు నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆలయ నిర్మాణాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరీంనగర్ సహా పొరుగు జిల్లాల హిందూ భక్తుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, ఆలయ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.
దివ్య కృపను పొందేందుకు ప్రేరణ
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని చూడబోతోందని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో భక్తులంతా భక్తిపూర్వకంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి, దివ్య కృపను పొందేందుకు ప్రేరణనిస్తుందని వెల్లడించారు. మీరు ఇప్పటికే చేపట్టిన కొన్ని మంచి చర్యలు భక్తుల నుంచి విశేషమైన ప్రశంసలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.