కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ముందు నుంచి ఊహించిందేనని అన్నారు. మేధావివర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావివర్గం, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటేనని బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలన ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని చెప్పారు. ఇవాళ కరీంనగర్‌లో బీజేపీ పట్టభద్రుల సంకల్పయాత్ర జరిగింది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ యాత్రలో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు తమకు వద్దని ప్రజలు అనుకున్నారని బండి సంజయ్ తెలిపారు.
