సీఎం పదవి కోసం కేసీఆర్ కుటుంబసభ్యులు కొట్లాడుతున్నరు – బండి సంజయ్

సీఎం పదవి కోసం కేసీఆర్ కుటుంబసభ్యులు కొట్లాడుతున్నరు అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తాజాగా బండి సంజయ్ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బుధువారం మూడోవ రోజుకు చేరుకుంది. యాత్రలో టిఆర్ఎస్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ ముందుకువెళ్తున్నారు. ముథోల్ నియోజకవర్గంలోని మహాగాంకు వచ్చిన బండి సంజయ్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘తెలంగాణనే బీజేపీ అడ్డా. ఈ జోష్ చూసే.. కేసీఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని సభ నిర్వహించుకున్నాం.

‘కేసీఆర్ ఇంట్లో ముఖ్యమంత్రి పదవి కోసం లొల్లి స్టార్ట్ అయింది..’ అని బండి సంజయ్ అన్నారు. ఇక్కడ రోడ్లు లేవని, మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మిషన్ భగీరథ నీళ్లిస్తనన్న ముఖ్యమంత్రి.. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మాగావ్ గ్రామంలో మాత్రం నీళ్లు రాలేదన్నారు. అవసరమైతే ఇక్కడికొచ్చి చూడు కేసీఆర్ అని సవాల్ విసిరారు. రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయని, డబుల్ బెడ్రూంలు కూడా రాలేదని ఆరోపించారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలేనని విమర్శించారు. మోడీ గారు ప్రధాని ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ.4వేల కోట్లు ఇచ్చారని బండి సంజయ్ చెప్పారు. దాన్ని కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరు చెప్పి కోతలు కోస్తున్నారన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకూ కేసీఆర్ సమాధానమివ్వలేదని బండి సంజయ్ చెప్పారు. కేంద్రమంత్రి వివరాలడిగినా ఎలాంటి సమాచారమివ్వలేదన్నారు. ఇళ్లిస్తానని కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.