బెలూన్ నోట్లో పేలిపోవడం వల్ల ఓ 8 ఏళ్ల బాలిక మరణించింది. బెలూన్‌కు గాలిని ఊదుతుండగా అకస్మాత్తుగా పేలిపోయింది. బెలూన్లోని ఓ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడం వల్ల ఊపిరాడక ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. సరదాగా ఆడుకుంటున్న బాలిక మరణించడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పిల్లలతో కలిసి సరదాగా బెలూన్లను ఊదుతుండగా ఈ ప్రమాదం
ధూలే నగరంలోని యశ్వంత్ నగర్‌లోని సక్రి రోడ్ సమీపంలో డింపుల్ మనోహర్ వాంఖడే అనే బాలిక ఈ ఘటనలో ప్రాణాలు విడిచింది. పిల్లలతో కలిసి సరదాగా బెలూన్లను ఊదుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి స్పృహతప్పి పడిపోయిన విషయాన్ని తోటి స్నేహితులు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. హుటాహుటినవారు ఓ ప్రైవేట్ వాహనంలో బాలికను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
మరో ఘటనలో పాలకుండలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
రాజస్థాన్‌లో మరుగుతున్న పాలకుండలో ప్రమాదవశాత్తు పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. డీగ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిందీ దుర్ఘటన.
మంగళవారం సాయంత్రం సారిక(3) ఇంటి పైకప్పుపై ఉన్న పిల్లిని చూసి భయపడింది. ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించింది. పరిగెడుతూ వెళ్తుండగా, స్టవ్ దగ్గర ఉంచిన వేడి పాలు ఉన్న పాత్రలో పడిపోయింది. దీంతో చిన్నారికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం భరత్‌పుర్‌కు, ఆపై జయపురకు తరలించారు. అక్కడ కాలిన గాయాలకు చికిత్స పొందుతూ చిన్నారి బుధవారం రాత్రి ప్రాణాలు విడిచింది.