ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించగా, అంతకు ముందుగా వారి సర్వీస్ సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా, ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ, సీనియార్టీ లెక్కింపు విధానాన్ని ఖరారు చేస్తున్నారు. గతంలో టీచర్ల బదిలీల్లో పారదర్శకత కరువైందనే విమర్శలు రావడంతో, ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తోంది. సీనియార్టీ జాబితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే ప్రక్రియ కొనసాగుతోంది. జాబితా విడుదల తర్వాత, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ప్రకటించనున్నారు.

పారదర్శకంగా బదిలీల ప్రక్రియ:
గతంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తోంది.
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
బదిలీల విధానంపై ఉపాధ్యాయుల సూచనలు తీసుకుని తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.
సీనియార్టీ లెక్కింపు – ముఖ్యాంశాలు:
8 ఏళ్ల సర్వీసు పూర్తి కాకముందే రిక్వెస్ట్ పెట్టుకుని బదిలీ అయినా, పరస్పర బదిలీల ద్వారా స్కూల్ మారినా, వారికి పాత స్కూల్ సర్వీస్‌గా లెక్కించనున్నారు. 8 ఏళ్లు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే త్వరలో విడుదల చేసే సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే సేకరించి తుది జాబితా రిలీజ్ చేయనున్నారు. అలాగే పీఈటీ, పీడీలు తమ స్కూల్స్ వదిలి ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు అనుమతించకూడదని నిర్ణయించారు.
ప్రతి మూడో శనివారం సమావేశాలు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలు మధ్యాహ్నం 1:00 నుంచి 5:00 గంటల వరకు కొనసాగుతాయి.
ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో మొత్తం రోజు సమావేశాలు ఉండటంతో పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు వచ్చేవి, అందుకే మధ్యాహ్నం సగం రోజు నిర్వహణకు మార్పులు చేశారు. 1, 2 తరగతులు & 3, 4, 5 తరగతుల ఉపాధ్యాయులకు వేర్వేరు రిసోర్స్ పర్సన్‌లను నియమించనున్నారు. సెకండరీ స్థాయిలో 7 రకాల సబ్జెక్టుల టీచర్లను వర్గీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.
పదో తరగతి ప్రీఫైనల్ పరీక్ష షెడ్యూల్:
ఈరోజు (ఫిబ్రవరి 15) స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ఉన్న నేపథ్యంలో, పదో తరగతి ప్రీఫైనల్ గణిత పరీక్ష ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు నిర్వహించనున్నారు. ఈ మార్పులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. పరీక్ష షెడ్యూల్‌ను స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు అనుగుణంగా మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకతను పెంచడంతో పాటు, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు దోహదపడనున్నాయి.