అక్రమ ఇసుక మాఫియాను బయట పెట్టాలి: అయ్యన్నపాత్రుడు

Ayyannapatrudu

అమరావతిః ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీవోను కూడా వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇసుక కోసం ప్రజలు ఇసుక డిపోలకు క్యూ కడుతున్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

నర్సీపట్నం నియోజకవర్గంలోని గబ్బడ ఇసుక డిపోలో ఉన్న అక్రమ నిల్వలపై అయ్యన్నపాత్రుడు విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డిపోలో అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల టన్నుల ఇసుకపై విచారణ జరపాలని చెప్పారు. వందల కోట్లను అక్రమంగా దోచుకున్న మాఫియాను బయట పెట్టాలని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దొంగలను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యాలను తొలగించినట్టు అవుతుందని అన్నారు. విచారణ జరిపి కేసు నమోదు చేసిన తర్వాతే ఇసుక బయటకు తీయాలని సూచన చేశారు.