70 ఏళ్లు పైబడిన వృద్ధులను ఆయుష్మాన్ భారత్ పథకం

Ayushman Bharat scheme for senior citizens above 70 years of age

న్యూఢిల్లీ: దేశంలో 70 ఏండ్లు పైడిన అందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏండ్ల వయసు పైబడిన అందరికీ ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందించనున్నట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా 4.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ బస్సులు, ఆంబులెన్సులు, ట్రక్కులు సహా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,900 కోట్లతో రెండేండ్ల పాటు పీఎం ఈ-డ్రైవ్‌ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలో రానున్న ఎనిమిదేండ్లలో 31,350 మెగావాట్లతో నూతన జల విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి రూ.12,461 కోట్లు కేటాయించాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్టు చెప్పారు.

2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన-4 అమలు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించినట్టు అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. దీని ద్వారా 25 వేల ఆవాసాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు 62,500 కిలోమీటర్ల మేర రోడ్లను, కొత్త వంతెనలను నిర్మించనున్నట్టు తెలిపారు. మొత్తం రూ.70,125 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పథకంలో రూ.49,087 కోట్లు కేంద్రం భరిస్తుందని, మిగతాది రాష్ర్టాలు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.