జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దుండగులు దాడి

ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి కలకలంరేపింది. ఆయన కారుపై గుర్తుతెలియని వ్యక్తు లు రాళ్లతో దాడి చేశారు. కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ కారులో ఎమ్మెల్యే బాలరాజు లేరు. దాని వెనుకున్న మరో కారులో ఆయన ఉన్నారు. ఆ కారులోనే ఎమ్మెల్యే ఉన్నారని భావించి దుండగులు బర్రిలంకలపాడు అడ్డ రోడ్డు వద్ద దాడి చేశారు. వెంటనే కారులో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కిందకు దిగి దాడికి పాల్పడ్డ వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారు అక్కడి నుంచి పరారయ్యారు. చీకటి పడటంతో దాడికి పాల్పడ్డ వారిని గుర్తించలేకపోయామని ఎమ్మెల్యే అనుచరులు తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాలరాజు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడులో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని.. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేపై ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు. పోలవరం ఎమ్మెల్యే వాహనంపై దాడి ఘటనకు సంబంధించి పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి స్పందించారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై జరిగిన దాడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు. ఆకతాయిల చేసిన పనా.. ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్న చెప్పారు. కారుపై దాడి జరిగిన వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి చుట్టుపక్కల విచారణ జరపడం జరిగిందని తెలిపారు.

పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారి వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. కొద్దిసేపటి క్రితం బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు…— JanaSena Party (@JanaSenaParty) July 29, 2024