కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నాంపల్లి నియోజకవర్గంలో రహదారి పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వృద్ధుడు గుంతలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రహదారిపై గుంతలు, తనకు తగిలిన గాయంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు వృద్ధుడు తెలిపాడు. దీంతో ఫిరోజ్ ఖాన్ రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయన వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ పై దాడి చేసారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఫిరోజ్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. చివరి వరకు తన గెలుపు ఖాయమంటూ ఫిరోజ్ ధీమాగా ఉన్నారు. కానీ చివరికి స్థానిక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయాన్ని అందుకున్నారు. అది కూడా కేవలం 1500 ఓట్లతో ఫిరోజ్ ఖాన్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.