అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి సంబంధించి ఢిల్లీలోని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి దాడికి పాల్పడ్డారు. అశోక్ రోడ్డులోని ఆయన ఇంటిపై దాడి చేసిన దుండగులు.. అక్కడి గేట్, నేమ్ ప్లేట్‌పై నల్ల ఇంకు పూశారు. ఆయనపేరు కనిపించకుండా చేశారు. అలాగే, భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లను కూడా అతికించారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒవైసీ తెలిపారు.

ఢిల్లీలో తన ఇంటి దగ్గర జరుగున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ.. ఢిల్లీలోని తన నివాసంపై టార్గెట్ చేస్తూ పదేపదే దాడులు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో జరిగిందని ఆరోపించారు. ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందో లేదో చెప్పాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ తరహా దాడులు తనను భయపెట్టలేవని, ఈ సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపాలని హెచ్చరించారు. రాళ్లు విసరడం, సిరా చుక్కలు చల్లడం వంటివి చేసిన తర్వాత పారిపోకుండా తనను నేరుగా ఎదుర్కొంవాలని సవాల్‌ విసిరారు.