మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల‌కు అడ్డుక‌ట్ట‌వేయాలి: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ

Atrocities against women should be stopped: President Droupadi

న్యూఢిల్లీ: కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌దిలించింది. దీంతో బాధితురాలికి మ‌ద్ద‌తుగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్న రాష్ట్ర‌ప‌తి.. అదో భ‌యాన‌క ఘ‌ట‌న అని పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి దారుణాల‌కు గురికావ‌డాన్ని ఏ నాగ‌రిక స‌మాజం అనుమ‌తించ‌బోద‌న్నారు. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌కు ఇక‌నైనా అడ్డుక‌ట్ట‌వేయాల‌ని చెప్పారు. పీటీఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై స్పందిస్తూ రాష్ట్ర‌ప‌తి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

”ఒకవైపు విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు కోల్‌కతాలో నిరసనలు చేపడుతుంటే మరోవైపు నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అకృత్యాలకు ఏ నాగరిక సమాజం కూడా తమ కూతుళ్లు, సోదరీమణులను బలి ఇవ్వదు. ఇలాంటి నీచమైన ఘటనల విషయంలో సమాజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్ల కాలంలో సమాజం ఎన్నో అత్యాచార ఘటనలను మరిచిపోయింది. ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైనది. గత తప్పులను ఎదుర్కొనేందుకు సమాజం భయపడుతోంది. కానీ ఇప్పుడు చరిత్రను సమూలంగా మార్చేందుకు సమయం ఆసన్నమైంది. సమగ్రమైన రీతిలో ఈ సమస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దాం” ఆమె పేర్కొన్నారు.