మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి: ప్రధాని మోడీ

Atrocities against women and children are a matter of grave concern: PM Modi

న్యూఢిల్లీ: దేశంలోని మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇది వారి భద్రతకు మరింత భరోసానిస్తుందన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సమక్షంలో జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ సదస్సు ప్రారంభ సెషన్‌లో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు. న్యాయవ్యవస్థలపై ప్రజలు ఎన్నడూ అపనమ్మకం చూపలేదన్నారు. ఇక ఇదే సదస్సులో దేశంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రస్తావించారు. మహిళపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలని అన్నారు.

‘మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో ఎంత వేగంగా న్యాయం జరుగుతుందో.. అప్పుడే వారి భద్రతపై ఎక్కువ భరోసా ఏర్పడుతుంది. దేశంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇప్పటికే అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలి. 2019లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం కింద సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా పర్యవేక్షక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే మహిళలపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వెలువడతాయి’ అని ప్రధాని మోడీ అన్నారు.