నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న ఆతిశీ

Atishi will take oath as Chief Minister of Delhi today
Atishi will take oath as Chief Minister of Delhi today

న్యూఢిల్లీ : ఆప్ నాయ‌కురాలు ఆతిశీ.. ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శ‌నివారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఢిల్లీలోని రాజ్ నివాస్‌లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సెనా.. ఆతిశీ చేత ప్ర‌మాణం చేయించ‌నున్నారు. ఆతిశీతో పాటు గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావ‌త్ మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఇందులో ముకేశ్ అహ్ల‌వత్ ద‌ళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్ర‌మాణం చేయ‌నున్నారు.

ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రజలు తాను నిజాయితీపరుడినని సర్టిఫికెట్‌ ఇచ్చేవరకూ సీఎం పదవిని చేపట్టబోనని ఆయన ప్రతినబూనారు. ఈ మేర‌కు కేజ్రీవాల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గ సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలుసుకున్న కేజ్రీవాల్‌ తన రాజీనామా పత్రాన్ని అందించారు. కేజ్రీవాల్‌ స్థానంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిశీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.

కాగా, ఢిల్లీ సీఎంగా అతిపెద్ద బాధ్యతను తనపై మోపిన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు అని ఆప్‌ నాయకురాలు ఆతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన షీలాదీక్షిత్‌, బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్‌ తరువాత ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం దేశంలో మమతా బెనర్జీ ఒక్కరే మహిళా సీఎం కాగా, రెండో సీఎంగా ఆతిశీ నిలవనున్నారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న అతి పిన్న వయస్కురాలు (43)గా కూడా ఆతిశీ నిలవనున్నారు.