ఢిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆతిషి మార్లేనా

Atishi sworn in as Delhi new CM

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిషి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. అతిషితోపాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆతిషి ప్రభుత్వం కొన్నాళ్లే కొనసాగనుంది. ఢిల్లీకి ఆమె మూడో మహిళా ముఖ్యమంత్రి కావడం గమనార్హం. సీఎం ఆతిషి క్యాబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది. గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్లకు మంత్రి పదవి దక్కింది. LG వీకే సక్సేనా వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ముకేశ్ అహ్లావత్ మినహా మిగిలిన నలుగురు అరవింద్ కేజీవాల్ క్యాబినెట్లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వారే కావడం విశేషం.

దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా, ఢిల్లీకి ఆరో సీఎంగా ఆతిషి నిలిచారు. అలాగే అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేపట్టనున్న మహిళగా కూడా ఆతిషి మార్లేనా సింగ్‌ నిలిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టయిన ఆప్ అధినేత, గత సీఎం కేజ్రీవాల్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సందర్భంగా సీఎం పదవికి రాజీనామా చేశారు.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కొన్ని నెలలు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ బెయిల్ మీద విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అతిశీ సీఎంగా ప్రమాణం చేశారు. అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేజ్రీవాల్ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిశీని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.