రష్యాలో కాల్పుల కలకలం.. 15 మంది పోలీసులు మృతి

కాల్పులతో రష్యా అట్టుడికిపోయింది. సాయుధులైన దుండగులు రష్యాలోని చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీసు అధికారులే లక్ష్యంగా ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటనలో తొమ్మిది మంది పోలీసులు, ఒక ప్రీస్ట్‌, ఓ సెక్యూరిటీ గార్డ్‌ సహా మొత్తం 15 మంది చనిపోయారు. పదలు సంఖ్యలో గాయపడ్డారు. దాడి చేసిన వారిలో ఆరుగురిని పోలీసు బలగాలు హతమార్చాయి.

దగెస్తాన్ ప్రాంతంలోని పెద్ద పట్టణం మకాచ్‌కలా, తీరప్రాంత పట్టణం దెర్బెంట్‌లలో ఈ కాల్పుల సంఘటనలు ఆదివారం సాయంత్రం ఒకే సమయంలో చోటు చేసుకున్నాయి. దెర్బెంట్‌లో సినగాగ్, చర్చ్ రెండింటికీ దుండగులు నిప్పుపెట్టారు. దగెస్తాన్ గవర్నర్ సెర్గేయ్ మెలికోవ్ వాటిని ‘ఉగ్రవాద దాడులు’గా అభివర్ణించారు. మృతుల్లో ఒక చర్చి ఫాదర్, పలువరు సాధారణ పౌరులు, కొందరు పోలీసులు ఉన్నారని మెలికోవ్ వెల్లడించారు.

‘‘ఈ ఉగ్రవాద దాడుల వెనుక ఎవరి హస్తముందో, వారి లక్ష్యం ఏమిటో మాకు తెలుసు’’ అని మెలికోవ్ టెలిగ్రామ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. వారెవరో ఆయన స్పష్టం చేయలేదు, కానీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం గురించే ఆయన ప్రస్తావించారని తెలుస్తోంది. మకాచ్‌కలా, దెర్బెంట్ పట్టణాల్లో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారని మెలికోవ్ తెలియజేసారు. దుండగులపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో మకాచ్‌కలా పట్టణంలో నలుగురు, దెర్బెంట్‌లో ఇద్దరు దుండగులు హతమయ్యారని మెలికోవ్ వెల్లడించారు.