ఆస్ట్రోనాట్స్‌ క్షేమంగా తిరిగి రావాలి: కేటీఆర్‌

Astronauts should return safely: KTR

హైద‌రాబాద్‌: అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమ‌గాములు సునీతా విలియ‌మ్స్‌, బుచ్ విల్మోర్‌.. అక్క‌డే చిక్కుకున్న విష‌యం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైన‌ర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తిన నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రూ అక్క‌డే ఉండిపోయారు. వాళ్లు ఎప్పుడు తిరిగి భూమి మీద‌కు వ‌స్తార‌న్న విష‌యంపై క్లారిటీ లేదు. కేవ‌లం 8 రోజుల మిష‌న్‌కు వెళ్లి.. ఇంత వ‌ర‌కు తిరిగి రాలేదు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాళ్లు వెన‌క్కి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అయితే స్పేస్ఎక్స్‌కు చెందిన డ్రాగ‌న్ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా వ్యోమ‌గాముల‌ను తీసుకువ‌చ్చేందుకు నాసా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అమెరికా-భార‌త సంత‌తి వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ క్షేమంగా తిరిగి రావాల‌ని ఆశిస్తూ ఈరోజు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో వ్యోమ‌గాముల అంశంపై ట్వీట్ చేశారు. స్పేస్‌లో చిక్కుకున్న ఆ ఇద్ద‌రు ఆస్ట్రోనాట్స్ క్షేమంగా ఉండాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఇద్ద‌ర్నీ వెన‌క్కి తీసుకురావ‌డం.. నాసాకు పెనుస‌వాల్‌తో కూడుకున్న అంశ‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఆస్ట్రోనాట్స్‌ను భూమ్మీద‌కు తీసుకువ‌చ్చేందుకు స్టార్‌లైన‌ర్ స‌మ‌స్య‌ను త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు.