10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు: ఈసీ

Assembly elections in Jammu and Kashmir after 10 years: EC
Assembly elections in Jammu and Kashmir after 10 years: EC

న్యూఢిల్లీ : హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా అక్టోబర్ 04న విడుదల కానున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, అవిభక్త జమ్మూ కాశ్మీర్‌ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేసిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 87.07 లక్షల మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 11 వేల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3.71 లక్షల మంది యువత తొలిసారిగా ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.

2014 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. 2018 నుంచి గవర్నర్ పాలనలో ఉంది. సెప్టెంబర్ 30 నాటికి జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం తిరిగి రావాలనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన మరుసటి రోజు ఆగస్టు 20 నాటికి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని ఈసీ తెలిపింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, వారి కొత్త భవిష్యత్తుని కోరుకుంటున్నారని ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ అన్నారు. “ఎన్నికల సన్నాహాలను పరిశీలించడానికి మేము ఇటీవల J&K ను సందర్శించాము. గొప్ప ఉత్సాహం కనిపించింది… ప్రజలు ఈ ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ప్రజలు వీలైనంత త్వరగా ఎన్నికలు కోరుకుంటున్నారు…” అని ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఓటర్లలో చైతన్యం కనిపించిందని చెప్పారు.