ఓ సీనియర్ పోలీసు అధికారి ప్రాణాలకే భద్రత లేనప్పుడు, సాధారణ పోలీసుల పరిస్థితి ఏంటి?ప్రజల పరిస్థితి ఏంటి?పోలీస్ ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలను అడ్డుకున్న ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిణిపై హత్యాయత్నం జరిగిందనే వార్త తీవ్ర కలకలం రేగుతోంది. గతేడాది జరిగిన ఈ ఘటనపై ఆమె రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారికి లేఖ రాశారు. ఆమె ఆఫీసుకు నిప్పంటించి.. చంపడానికి ప్రయత్నించారని అందులో ఆరోపించారు. గతేడాది జులై చివరిలో అంటే ఆరు నెలల కిందట ఘటన జరగ్గా.. ఆమె అప్పట్లో రాసిన లేఖ బయటకు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణిపై హత్యాయత్నం సంచలనంగా మారింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. డీజీపీ శంకర్ జివాల్‌కు అడిషినల్ డీజీపీ కల్పనా నాయక్ రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతేడాది జులై 29న చెన్నై నగరంలోని తన కార్యాలయం మంటల్లో కాలిబూడిదయ్యిందని, ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని ఆ లేఖలో ఏడీజీపీ పేర్కొన్నారు.తనను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యాయత్నంగా అనుమానిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. పోలీసు శాఖలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, జైలువార్డెస్లు, ఫైర్ సిబ్బంది ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలను బయటపెట్టిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగిందని సీనియర్ ఐపీఎస్ అధికారిణి లేఖలో తెలిపారు. కోర్టు ఉత్తర్వులను అధిగమించి ఎంపిక ప్రక్రియను అడ్డుకుని.దానివల్ల జరగబోయే అప్రతిష్ట నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడానని చెప్పారు. అదే తన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిందని కల్పనా నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత ఆగస్టు 15న తాను డీజీపీకి లేఖ రాశానని, దాని ప్రతులను హోంశాఖ కార్యదర్శి, చెన్నై పోలీస్ కమిషనర్‌కు కూడా పంపినట్లు చెప్పారు. తనను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యాయత్నంపై విచారణ జరపాలంటూ ఆరునెలల కిందటే ఆదేశించినప్పటికీ నివేదిక ఇంకా బయటపెట్టలేదన్నారు.