హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కులగణన బలహీన వర్గాల ఆకాంక్ష అని తెలిపారు. 1931లో కులగణన చేశారు. 1931 నుంచి ఇప్పటివరకు కులగణన చేయలేదు. కాబట్టి ఈ కులగణన దేశ చరిత్రలోనే రికార్డు అని తెలిపారు. ఇప్పటి వరకు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టాం.

రాజకీయాలు, పార్టీలకతీతంగా ఈ కులగణన సర్వేను అభినందించాలని.. ఏమైనా సూచనలుంటే కూడా చేయాలని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బలహీన వర్గాలకు ఈరోజు శుభదినం అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రతి పక్ష నాయకులు పలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఎలాంటి బేషాజాలు లేకుండా కులగణన ద్వారా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి.. దీంతో రోడ్డు మ్యాప్ రావాలి అని కోరుతున్నాను.
కాగా, కులగణన గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని, సర్వేలో ఎమ్మెల్సీ కవిత తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాల్గొనలేదని ఆయన గుర్తు చేశారు. సర్వేకు సహకరించనివాళ్లకు సర్కారును విమర్శించే హక్కులేదన్నారు. కొన్ని చోట్ల సర్వేకు ఎన్యుమరేటర్లు వెళితే కుక్కలను వదిలి భయాందోళన సృష్టించారని మంత్రి మండిపడ్డారు. కులగణన వివరాల గురించి మాట్లాడే జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ సర్వేలో ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు.