కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ..?

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాకులు ఇస్తున్నారు సొంత ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 119 స్థానాలకు గాను కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదాకు పరిమితం అయ్యింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు సొంత పార్టీ లో ఉండడం లేదు. వరుసగా ఆ పార్టీ ని విడి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఈరోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారు. కాగా రేపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. కాగా గ్రేటర్ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ ఇంకా ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

అరికెపూడి గాంధీ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్నాడు. ఈయన శేరిలింగంపల్లి టీడీపీలో క్రియాశీలకంగా పని చేశాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం టీడీపీ పార్టీ టికెట్ ఆశించిన దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కొమరగోని శంకర్ గౌడ్ పై 76,257 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2016, మార్చి 11న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో TRS నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ పార్టీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ పై 44,295 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2019, సెప్టెంబరు 7న ప్రభుత్వ విప్ గా ప్రభుత్వం నియమించింది. 2023 లో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.