జ్యూరిచ్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారు.. రాణిస్తారు. అన్ని దేశాల్లో తెలుగు వారి ప్రింట్ ఉంటుంది. అదే మన గొప్పతనం అని తెలిపారు. ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..? అని ఆశ్చర్యపోయానని తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందన్నారు.

చదువులో ఆడపిల్లపై వివక్ష చూపించవద్దని ఆనాడే చెప్పాను. పురుషుల కంటే మహిళలే తెలివైన వారని నిరూపితమైంది. ప్రస్తుతం యువకుల కంటే యువతులే ఎక్కువగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. హైదరాబాద్ లో భూములు అమ్ముకోవద్దని చాలా మందికి చెప్పాను. హైదరాబాద్ లో భూములకు అధిక ధర వస్తుందని ఆనాడే చెప్పా. తెలంగాణ తలసరి ఆదాయం హైదరాబాద్ సంపదే కారణం అని సిఎం చంద్రబాబు తెలిపారు. మరోజన్మ ఉంటే తెలుగు వారిగా పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు.
తాను జైలులో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. చాలా దేశాల్లో ఉన్న తెలుగువారు నిరసన తెలిపారని చెప్పారు. కూటమి గెలుపులో ఎన్‌ఆర్‌ఐల పాత్ర ఎంతో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు సహకరించాలని.. స్విస్ రాయబారి మృదుల్ కుమార్‌ను చంద్రబాబు బృందం కోరారు. కాసేపట్లో తెలుగు కమ్యూనిటీతో చంద్రబాబు ‘మీట్ అండ్ గ్రీట్’ నిర్వహించనున్నారు. అనంతరం జ్యూరిచ్ నుంచి దావోస్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.