అమరావతి: కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మద్యం షాపులు దక్కించుకోవాలనుకునే ఆశావహులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
టెండర్ల షెడ్యూల్ మార్పు కొరుతూ వివిధ జిల్లాల్లో ఉన్న దరఖాస్తుదారుల నుంచి భారీ ఎత్తున్న అభ్యర్థనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో సర్కార్ షెడ్యూల్‌ను మార్చింది.
ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అలాగే 14న మద్యం షాపులకు లాటరీ విధానంలో డ్రా తీసి, 16 నుంచి దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించడం జరుగుతుందని పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు గాను మంగళవారం రాత్రి వరకు 41,348 దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.826.96కోట్ల ఆదాయం వచ్చి చేరినట్లు సమాచారం. కాగా, ఒక్కొ దరఖాస్తుకు నాన్-రిఫండబుల్ కింద రూ.2లక్షలు కట్టాల్సి ఉన్న విషయం తెలిసిందే.