క్షమాపణలు కోరుతున్నా.. పార్టీ ఓటమి నాదే బాధ్యత: రిషి సునాక్‌

Rishi Sunak concedes to Keir Starmer in UK elections: I am sorry

లండన్‌ః బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 14 సంవత్సరాల కన్జర్వేటివ్‌ల అధికారానికి చెక్ పడింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయ కేతనాన్ని ఎగురవేస్తోంది. ఈ ఎన్నికల్లో సునామీని సృష్టించింది. రికార్డుస్థాయిలో పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటోంది. 650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 326. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలోనే లేబర్ పార్టీ పూర్తి మెజారిటీని అందుకుంది. 329 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇంకా 72 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునాక్ సారథ్యంలో మొన్నటివరకు అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడబోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు 74 స్థానాల్లో మాత్రమే గెలిచారు. మరో 50 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. 2019 నాటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్య 344. సండర్‌ల్యాండ్‌ సౌత్‌లో తొలి విజయాన్ని అందుకుంది లేబర్ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి సర్ కీర్ స్టార్మర్ ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. లేబర్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆయనే. పూర్తి మెజారిటీతో లేబర్ పార్టీ అధికారంలో వస్తే స్టార్మర్.. ప్రధాని అవుతారు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ లేబర్ పార్టీ ఆధిక్యత మరింత పెరగడం కనిపించింది.

ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తన మద్దతుదారులను ఉద్దేశించి సునాక్‌ ప్రసంగించారు. ‘బ్రిటన్‌ ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పును ఇచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు క్షమాపణలు కోరుతున్నా’ అని సునాక్‌ తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి తానే నైతిక బాధత్యను తీసుకుంటోన్నట్లు రిషి సునాక్ చెప్పారు. అధికార మార్పిడి సజావుగా సాగుతుందని వ్యాఖ్యానించారాయన. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవిశ్రాంత కృషి చేశామని, అంకితభావంతో పాలన సాగించామని పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమించారని, ప్రజల తీర్పు బాధాకరమే అయినప్పటికీ అంగీకరిస్తున్నానని అన్నారు.