ఏపీలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

ఏపీలో భారీ వర్షాలు పలు చోట్ల విషాదం నింపాయి. నిన్న విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ, లాలూ పుర్కాయిత్, సంతోష్ ఉన్నారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. గుంటూరు (D) ఉప్పలపాడులో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోవడంతో టీచర్ రాఘవేంద్ర, విద్యార్థులు మాన్విక్, సౌరిశ్ మృతిచెందారు. మంగళగిరి గండాలయపేటలో కొండచరియలు విరిగిపడి నాగరత్నమ్మ చనిపోయింది.

విజయవాడ లో 50 ఏళ్ల రికార్డు ను బ్రేక్ చేస్తూ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎక్కడిక్కడే రోడ్ల ఫై వాహనాలు నిలిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొటెత్తడంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను అధికారులు వెరే మార్గాలకు మళ్లించారు.

భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి జలదిగ్భందంలో చిక్కుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కాజ టోల్‌ప్లాజా వద్ద పరిస్థితి దారుణంగా మారింది. మోకాళ్ల లోతుకుపైగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీళ్లలో కార్లు, బైకులు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న వాహనాలు ఆగిపోవడంతో వాటిని పక్కకు తీసే వరకు బస్సులు, లారీలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.