ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ వినియోగంలో నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహా డీప్ టెక్నాలజీ రంగాల్లో ఇతర రాష్ట్రాల కంటే ముందుంటుందని తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్స్ బెర్గ్, మరియు మార్క్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని చంద్రబాబు వెల్లడించారు. ఈ కంపెనీల ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. డేటా ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తోందని అన్నారు. డీప్ టెక్నాలజీ రంగంలో కొనసాగుతున్న పరిశోధనలు మరింత అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.