AP High Court: ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు పోలీసుల వైఖరితో ఆ వ్యవస్థను నమ్మే పరిస్థితి లేకుండా పోతోందని ఫైర్ అయింది. ఇందులో భాగంగానే హైకోర్టులో కూర్చునే న్యాయమూర్తులకు వీధుల్లో జరిగే విషయాలు ఏవీ తెలియవని భ్రమపడొద్దని పోలీసులను హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా అరెస్ట్‌లను హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వ్యంగ్యంగా విమర్శిస్తూ వీడియోలు, పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా అయితే అలాంటి సినిమాలు తీసే దర్శకులు, హీరోలు, విలన్లను కూడా అరెస్టు చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మిగతా కేసుల్లో ఇంతే వేగంగా స్పందిస్తున్నారా?
ఇందులో భాగంగానే గుంతలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై దోపిడీ, బలవంతపు వసూళ్ల సెక్షన్ల కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. ఫిర్యాదు అందిన వెంటనే కర్నూలు నుంచి వచ్చి గుంటూరులో ఉన్న ప్రేమ్ కుమార్‌ను తెల్లవారుజామునే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐని నిలదీసింది. ఈ మేరకు కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సీఐపై మండిపడింది. మిగతా కేసుల్లో ఇంతే వేగంగా స్పందిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎన్ని కేసులను మెరుపు వేగంతో విచారించారంటూ ప్రశ్నించింది.
గుంతలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే
ఈ కేసుకి సంబంధించి పూర్తి రికార్డులను తమ ముందు పొందుపరచాలని సీఐ, సంబంధిత మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. కాగా, ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. గుంతలు పూడ్చాలి అంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ అందులో తెలిపాడు. దీంతో ప్రేమ్‌కుమార్ పోస్టుపై కర్నూలు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. దీని అనంతరం తన తండ్రి అరెస్టుపై ప్రేమ్‌కుమార్ కుమారుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సీఐపై మండిపడింది.