బాధితులకు ఏపీ సర్కార్ రూ.25,000 సాయం..!

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ. 10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు, బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

ఇటు కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం ఈరోజు పర్యటించనుంది. ఈ నేపథ్యంలో రామవరప్పాడు, కేసరపల్లి ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ బాలాజీ పర్యటించారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాలువను పరిశీలించారు. జిల్లాలో 64 గ్రామాలపై బుడమేరు వరదల ప్రభావం పడిందని, 50 వేల హెక్టారుల్లో పంటలు ముంపులో ఉన్నాయన్నారు. పంట నష్టం వివరాలు, ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ బాలాజీ అన్నారు.

తొలుత కలెక్టర్ రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ముస్తాబాద్ రహదారి పరిశీలించారు. దెబ్బతిన్న ఆ రహదారికి మరమ్మతులు చేపట్టేందుకు 10 లక్షలతో అంచనాలు తయారు చేసినట్లు అధికారులు కలెక్టర్​కు వివరించారు. అనంతరం గన్నవరం జాతీయ రహదారి వంతెన వద్ద బుడమేరు నది ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వాస్తవాలను తెలియజేసేలా ఛాయచిత్రాలు, వీడియోలు సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.